||ప్రతీకాత్మక చిత్రం||
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ బోర్డు పరీక్షల ఫీజు చెల్లించే తేదీలను తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు (Board of Intermediate Education) విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పరీక్షల కోసం విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అన్ని జూనియర్ కాలేజీలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాలి. రూ.100 ఆలస్య రుసుంతో నవంబర్ 16 నుంచి 23 వరకు, రూ.500 జరిమానాతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 6 నుంచి 13 వరకు, రూ.2 వేల జరిమానాతో డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చు. ఫస్టియర్ రెగ్యులర్ విద్యార్థులు రూ.510, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు రూ.730, సెకండియర్ ఆర్ట్స్ విద్యార్థులు రూ.510, సైన్స్, ఒకేషనల్ విద్యార్థులు రూ.730 ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.