తెలంగాణలో క్రమబద్ధీకరించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ హైకోర్టు భవనం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో క్రమబద్ధీకరించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. డిగ్నీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు తీర్పుకు ఇది విరుద్ధం అని వాదించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు.. క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 డిపార్ట్‌మెంట్లలోని 5,544 కాంట్రాక్ట్ ఉద్యోగులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 13 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు. వీరందర్నీ క్రమబద్ధీకరించగా.. తాజాగా, వీరి నియామకం రద్దుకానుంది.