తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. పాలిటెక్నిక్ కాలేజీలకు కూడా సెలవు ప్రకటించాల్సి ఉండగా, అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, హైదరాబాద్ : ఓవైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ మొత్తం జలమయమైంది. సోమవారం రెడ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కూడా. దాంతో రాష్ట్రప్రభుత్వం అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖలన్నీ తమ పరిధిలోని కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. చివరికి జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు కూడా సెలవుపై ముందురోజే ప్రకటన చేశాయి. కానీ, తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. పాలిటెక్నిక్ కాలేజీలకు కూడా సెలవు ప్రకటించాల్సి ఉండగా, అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
తీరిగ్గా.. సోమవారం కాలేజీ ప్రారంభం అయ్యే కొన్ని నిమిషాల ముందు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే సుదూర ప్రాంతాలనుంచి కాలేజీకి విద్యార్థులు, అధ్యాపకులు బయలుదేరారు కూడా. పైగా, ఆ ఆదేశాలు మౌఖికంగా మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఇంత అలసత్వం ప్రదర్శించటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ముందుచూపు లేకుంటే ఎలా అని తిట్టిపోస్తున్నారు. ఇంత ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ చైర్మన్ శ్రీదేవసేనను ప్రశ్నిస్తున్నారు.
ఓపక్క వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్నా, కాలేజీ ఉందని తమ పిల్లలను ఉదయాన్నే కాలేజీకి పంపించామని.. తీరా ఉదయం 8-8:30 గంటలకు కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ సమాచారం ఇచ్చారని, ఇప్పుడు చెప్తే ఎలా అని ప్రశ్నిస్తే.. తమకు పైనుంచి ఇప్పుడే ఆదేశాలు వచ్చాయని అధ్యాపకులు చెప్పారని తల్లిదండ్రులు వెల్లడించారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీస్తున్నారు.