||ప్రతీకాత్మక చిత్రం||
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ప్రతీ ఒక్కరిది, ఉద్యోగార్థులది ఉద్యమంతో ప్రత్యేక అనుబంధం. ఏదో ఒక సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారే. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగానే ఉద్యమం సాగింది. ఇప్పుడున్న పాలకులూ ఉద్యమంలో ఉన్నవారే. ఉద్యమ ఘనత గురించి చెప్పుకుంటే టైం చాలదు. కానీ, మొన్న ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు మాత్రం తెలంగాణ ఉద్యమానికి చోటే లేకుండా పోయింది. తొలి, మలి ఉద్యమాల్లోని ఏ సంఘటనపైనా ప్రశ్న లేకపోవడం గమనార్హం. ఇంతకుముందు నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ కొందరు మహానుభావుల పుణ్యమా అని రద్దయ్యింది. దీంతో గ్రూప్-1కి సెలెక్ట్ అవుతామనుకున్న ఎంతోమంది ఉద్యోగార్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. సరే.. మరోసారి పరీక్ష రాద్దాంలే అనుకొని.. ప్రిపేర్ అయ్యారు. ఏదో ప్రిపేర్ అయితే, ఏవో ప్రశ్నలు వచ్చాయి. సరే.. సబ్జెక్ట్ లోతుగా, గొట్టు ప్రశ్నలు ఇచ్చారని సర్దుకుపోయారు. కానీ, దారుణంగా నిరాశ పరిచిన విషయం ఏమిటంటే.. ఏ ఒక్కటి కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రశ్న రాకపోవడం.
ఉద్యమం గురించి ప్రశ్నలు అడగాలని ఏమైనా రూల్ ఉందా? అని కొందరు అడగొచ్చు. కానీ, తెలంగాణవాదిగా ప్రతీ ఒక్కరు ఉద్యమంపై ప్రశ్న ఉండాలని కచ్చితంగా కోరుకుంటారు. కానీ పేపర్ మొత్తం వెతికినా ఎక్కడా కనిపించకపోవటం గమనార్హం. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారి తెలంగాణ పేరును తీసేసినట్లే.. తెలంగాణ ఉద్యమ అనుభవాలు కూడా అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారా? అని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన సగటు అభ్యర్థి చర్చించుకోవడం గమనార్హం. పేపర్ తయారు చేసింది కేసీఆర్ కాదు కదా.. అన్న డౌటూ వస్తుంది. ఆ పేపర్ తయారు చేసింది తెలంగాణ సార్లు కాదా? వాళ్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? పోనీ వారికి ఉద్యమం గురించి తెలియదా? అన్న ప్రశ్నలను ఉద్యోగార్థులు లేవనెత్తుతున్నారు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని తయారుచేసే నిపుణులు కొన్ని ప్రశ్నలను రూపొందిస్తారు. ఆ ప్రశ్నల నుంచి ఎంపిక కమిటీ కొన్ని ప్రశ్నలను ఎంచుకుంటుంది. మరి.. ఆ ఎంపిక కమిటీకి ఉద్యమానికి సంబంధించిన ప్రశ్నలు ప్రాధాన్యం అనిపించలేదా? అని కూడా అడుగుతున్నారు.
అసలే.. పార్టీ పేరు నుంచి తెలంగాణ పేరును తొలగించటం.. టీఆర్ఎస్‌లోని తెలంగాణ ఉద్యమకారులకు కూడా నచ్చలేదన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడేమో తెలంగాణ ఉద్యమం అనే కీలకాంశం లేకుండా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వీటన్నింటిని కేసీఆర్ ఎలా సమర్థిస్తారన్నది ప్రశ్నగా మిగిలింది. ఏదేమైనా తెలంగాణ ఉద్యమంపై ప్రశ్న లేకుండా పరీక్ష జరగడం వెలితిగా కనిపించిందన్నది ఉద్యోగార్థుల మాట.