||ప్రతీకాత్మక చిత్రం||
విద్యార్థులకు జేఎన్టీయూ హైదరాబాద్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి రెండు పీజీలు చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. అది కూడా ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. విద్యార్థి ఒకే టైంలో రెండు పీజీ కోర్సుల్లో చేరి రెండు పీజీ పట్టాలు పుచ్చుకోవచ్చు. ఈ మేరకు ఈ ప్రోగ్రాంను అందించేందుకు సిద్ధంగా ఉన్న కాలేజీలు ఈ నెల 30 లోగా రిజిస్ట్రార్‌ను సంప్రదించి అనుమతి తీసుకోవచ్చని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ తెలిపారు. డబుల్ పీజీ క్లాసులను అక్టోబర్ 30 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కోర్సుల్లో పాఠ్యాంశాలుగా డాటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, విశ్లేషణ, మారెటింగ్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, బిజినెస్ ఎకనామిక్స్, లీగల్ , బిజినెస్ ఎన్విరాన్ మెంట్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తదితర అంశాలు ఉంటాయని వివరించారు.
కొన్ని సబ్జెక్టులను ఆఫ్‌లైన్‌లో, మిగతా సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు. అయితే, జేఎన్టీయూలో పీజీ చేస్తున్న విద్యార్థులు మాత్రమే ఈ డబుల్ పీజీకి అర్హులు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గత ఏడాదే జేఎన్టీయూ డ్యుయల్ డిగ్రీ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. బీటెక్, బీఫార్మసీ, బీబీఏ డాటా అనలిటిక్స్ ప్రోగ్రామ్‌లో డ్యుయల్ డిగ్రీ చేసుకొనే అవకాశం కల్పించింది. అది విజయవంతం కావటంతో ఈ ఏడాది డబుల్ పీజీని అమలు చేస్తోంది.