సర్కారు బడి సార్లు సూపర్.. విద్యార్థుల అడ్మిషన్ల కోసం ముందస్తు బడిబాట

విద్యార్థులను సర్కారు బడివైపు నడిపించేందుకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

balwanthapur badi bata

ముందస్తు బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు

ఈవార్తలు, జగిత్యాల : ఎండాకాలం రాగానే ప్రైవేటు స్కూళ్లన్నీ గ్రామాల్లో వాలిపోతాయి. ఏ వీధిలో చూసినా ప్రైవేట్ స్కూళ్ల టీచర్లే కనిపిస్తారు. చేతిలో పాంప్లెట్లు పట్టుకొని తిరుగుతుంటారు. పిల్లలను తమ స్కూళ్లలో చేర్పించాలని వేడుకుంటారు. బాగా చదువు చెప్తాం.. ర్యాంకులు తెప్పిస్తాం.. కావాలంటే ఫీజులో డిస్కౌంట్ ఇస్తాం అని మభ్యపెడతారు. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంచి నాణ్యమైన, క్వాలిఫైడ్ టీచర్లు అందించే ప్రభుత్వ విద్యను విద్యార్థులు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు కూడా డబ్బు వృథా చేసుకుంటున్నారు. అయితే, ప్రైవేటు స్కూళ్లకు మించిన నాణ్యమైన విద్యను అందించే సత్తా ప్రభుత్వ పాఠశాలలకు ఉందని, ప్రభుత్వం అందించే ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని సర్కారు బడి ఉపాధ్యాయులు గ్రామాల్లోకి వచ్చి తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ బడిలో చేర్పించి, విద్యార్థుల బంగారు బాటకు బాటలు వేయాలని కోరుతున్నారు.

వాస్తవానికి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో జూన్‌లో ఉంటుంది. కానీ, అప్పటికే విద్యార్థులంతా ప్రైవేట్ స్కూళ్లలో చేరిపోతుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను సర్కారు బడివైపు నడిపించేందుకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మంగళవారం గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాం, ఉచిత పుస్తకాలు అందించే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహ్మద్ సాజిద్ హుస్సేన్, రవీందర్, మల్లేశం, విద్యార్థులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్