శ్రీరామచంద్రమూర్తి జన్మించిన చైత్ర శుద్ధ నవమి వచ్చేసింది. అసలు నవమి రోజే ఆ పరంధాముడు, పురుషోత్తముడు అవతరించడానికి కారణం ఏమిటి ?
శ్రీరామ జన్మ రహస్యం తెలిపే తొమ్మిది అంకె.. రామ పేరు పెట్టిందెవరంటే..
ధర్మ బద్ధ జీవనానికి ఒక నిలువెత్తు నిర్వచనంగా, మనిషి ఇలా బతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానుష్య జన్మకున్న వైశిష్ట్యాన్ని మనకి ఆవిష్కరించిన మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామచంద్రమూర్తి. శ్రీరాముని జన్మదినోత్సవాన్ని నాటి నుంచి నేటి వరకు అంగరంగ వైభవంగా జరుపుకోవడమే మహద్భాగ్యం. అటువంటి దివ్య సుందర మూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఆ దివ్య మానవుడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి వచ్చేసింది. అసలు నవమి రోజే ఆ పరంధాముడు, పురుషోత్తముడు అవతరించడానికి కారణం ఏమిటి ? అంటే.. నవమి పరమేశ్వర తత్వాన్ని సూచిస్తుంది కాబట్టి. పెద్దలు 9 సంఖ్య పరమాత్మని సూచిస్తుందంటారు. 9 అంకెని ఏ అంకెతో గుణించినా మళ్లీ 9 వస్తుంది. అంటే.. పరమాత్మ ఎన్ని రూపాల్లో ఉన్నా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలు తత్వం మాత్రం ఒక్కటేనని నిరూపించేది 9 అంకె.
ఇక.. రామ శబ్దం చాలా గొప్పది. ‘ఓం నమో నారాయణాయ’ అన్న అష్టాక్షరీ మహమంత్రంలోని ‘‘రా’’ బీజాక్షరాన్ని ‘ఓం నమః శివాయ’ అన్న పంచాక్షరీ మహామంత్రంలోని ‘‘మ’’ బీజాక్షరాన్ని తీసుకువచ్చి ‘‘రామ’’ అన్న పేరుని దశరథాత్మజునికి వశిష్టులు పెట్టారు అని అంటారు. రామ అని మనం అనేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలు బయటికి వచ్చి దహించబడతాయని, మ అక్షరం పలికే సమయంలో నోరు మూసుకొని బయట ఉన్న పాపాలు లోనికి రాకుండా ఉంటాయని ఆర్యోక్తి.
శివుడు పార్వతికి చెప్పిన శ్లోకం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
పరమశివుడు పార్వతీ దేవితో చెప్పిన శ్లోకం ఇది. రామ.. రామ.. రామ.. అని మూడు సార్లు జపిస్తే విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలం వస్తుందని శివుడు చెప్తాడు. అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం ‘‘య’’ వర్గంలో ‘‘రా’’ రెండవ అక్షరం కాగా, ‘‘ప’’ వర్గంలో ‘‘మ’’ ఐదవ అక్షరం.. 2*5=10. దీన్ని బట్టి ఒకసారి రామ అంటే పది సంఖ్యకు సంకేతం. ఇక మూడు సార్లు జపిస్తే 10*10*10=1,000కి సమానం.