వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌కు తమ సన్నాహాలను పక్కాగా మొదలుపెట్టేందుకు ప్రపంచ ఛాంపియన్ భారత్ సిద్ధమైంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో బరిలోకి దిగుతోంది.
టీ20 సిరీస్‌కు టీమిండియా
జట్టులోకి శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా పునరాగమనం
నేడు కటక్‌లో తొలి టీ20 మ్యాచ్
వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌కు తమ సన్నాహాలను పక్కాగా మొదలుపెట్టేందుకు ప్రపంచ ఛాంపియన్ భారత్ సిద్ధమైంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో బరిలోకి దిగుతోంది. రేపు కటక్ లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియా మరింత పటిష్ఠంగా మారింది. ఈ సిరీస్ ద్వారా వరల్డ్ కప్ జట్టు కూర్పుపై ఓ స్పష్టతకు రావాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. గాయం కారణంగా దాదాపు నెల రోజులు ఆటకు దూరమైన గిల్, ఆసియా కప్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం జట్టుకు ఎంతో శుభదాయకం. గిల్ రాకతో యువ సంచలనం అభిషేక్ శర్మతో కలిసి మరోసారి పటిష్ఠమైన ఓపెనింగ్ జోడీ బరిలోకి దిగనుంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు దేశవాళీ టి20 టోర్నీలో అభిషేక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హార్దిక్ రాకతో బ్యాటింగ్ డెప్త్‌తో పాటు బౌలింగ్ విభాగంలోనూ సమతుల్యం ఏర్పడుతుంది. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. గత 20 టి20 మ్యాచ్‌లలో ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయిన సూర్య, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో అతను తిరిగి ఫామ్ అందుకోవడం జట్టుకు అత్యవసరం. మరోవైపు, వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక దక్షిణాఫ్రికా జట్టులోకి స్టార్ పేసర్ అన్రిచ్ నోర్కియా తిరిగి వచ్చాడు. గాయాల కారణంగా ఆ జట్టు కీలక ఆటగాళ్లు టోనీ డి జోర్జి, క్వెనా మఫాకా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఫిబ్రవరిలో ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, దానికి ముందు భారత్ దక్షిణాఫ్రికాతో 5, న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడనుంది.
గిల్ సరైనోడు: సూర్య
జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు కొనసాగుతాయని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఓపెనింగ్ స్థానానికి సంజూ శాంసన్ కంటే శుభ్‌మన్ గిల్ సరైనవాడని అభిప్రాయపడ్డాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఓపెనింగ్ జోడీ తప్ప.. ఏ స్థానాలు ఆటగాళ్లకు స్థిరంగా ఉండవని తెలిపాడు. 'ఈ సిరీస్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు జరుగుతాయి. మూడో స్థానం నుంచి ఆరో బ్యాటర్ వరకు ఆటగాళ్లు మారుతూనే ఉంటారు. ఓపెనర్లు తప్పా మరే ఆటగాడికి స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ ఉండదు. మా జట్టులో ఏ స్థానంలోనైనా రాణించగలిగే ప్రతిభావంతులు ఉన్నారు. జట్టు నిండా ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. తొలి టీ20లో తిలక్ వర్మ ఆరో స్థానంలో ఆడవచ్చు. శివమ్ దూబే మూడో స్థానంలో బరిలోకి దిగవచ్చు. మా జట్టు విధానం ఇదే. ప్రస్తుతం మా టీమ్ చాలా బలంగా ఉంది. సంజూ శాంసన్ విషయానికొస్తే.. అతను ఓపెనర్‌గా పరుగులు చేశాడు. కానీ అతని కంటే ముందు గిల్ ఓపెనర్‌గా ఆడాడు. కాబట్టి ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ప్రాధాన్యం ఇస్తాం. అందుకు గిల్ పూర్తి అర్హుడు. సంజూ శాంసన్‌కు మేం చాలా అవకాశాలు ఇచ్చాం. అతను ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. సంజూ వంటి ఆటగాళ్ల వల్ల కెప్టెన్‌గా నా పని మరింత సులువు అవుతుంది. ఓపెనింగ్ చేయడంతో పాటు మిడిలార్డర్‌లో ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండటం మా జట్టు బలం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఐదు టీ20ల సిరీస్ షెడ్యూల్
తొలి టీ20 - డిసెంబర్ 9 (కటక్)
రెండో టీ20 - డిసెంబర్ 11 (ముల్లాన్‌పూర్)
మూడో టీ20 - డిసెంబర్ 14 (ధర్మశాల)
నాలుగో టీ20 - డిసెంబర్ 17 (లక్నో)
ఐదో టీ20 - డిసెంబర్ 19 (అహ్మదాబాద్)
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్