సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సలహా ఇచ్చాడు.
ఇర్ఫాన్ పఠాన్
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సలహా ఇచ్చాడు. టీ20ల్లో చోటును పదిలం చేసుకునేందుకు ఇదే మంచి అవకాశమని తెలిపాడు. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కటక్ వేదికగా తొలి టీ20 జరగనుంది. మెడనొప్పితో టెస్ట్, వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్‌తో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌కు పఠాన్ విలువైన సలహా ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026 ముందు జరుగుతున్న ఈ సిరీస్‌లో రాణించి విమర్శలకు బదులివ్వాలని తెలిపాడు. 'శుభ్‌మన్ గిల్ టీ20 ఫార్మాట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి. అతను మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడగలడు. టీ20ల్లో అతని సామర్థ్యం ఏంటో ఐపీఎల్‌లో మనమంతా చూశాం. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు అతనికి మంచి అవకాశం. అతనిపై కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ అతను గొప్ప ఆటగాడు. ఈ సిరీస్‌లో అతను రాణిస్తాడని ఆశిస్తున్నా. గాయం నుంచి కోలుకున్న తర్వాత ధర్మశాల వంటి పేస్, బౌన్స్ పిచ్‌లపై అతనికి పరుగులు చేసే అవకాశం లభించనుంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే రెండో పేసర్ ఎవరో చూడాలనుకుంటున్నాను. అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు హార్దిక్ పాండ్యాతో కలిసి బౌలింగ్ చేయవచ్చు. ప్రపంచకప్ ముందు వారి ప్రదర్శన చాలా కీలకం. ఇక హార్దిక్ పాండ్యాతో ఫినిషర్ పాత్ర పోషించే బ్యాటర్ ఎవరా? అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవడానికి లోయరార్డర్ బ్యాటర్ ఫామ్‌లో ఉండటం కీలకం. హార్దిక్ పాండ్యాతో కలిసి ఆటను ముగించగల మరో బ్యాటర్‌పై నా దృష్టి ఉంటుంది.'అని ఇర్ఫాన్ ఠాన్ పేర్కొన్నాడు.