భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రతీకాత్మక చిత్రం
కొంపముంచిన హర్షిత్ రాణా
గెలిచే మ్యాచ్‌లో టీమిండియా చిత్తు
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. డ్యూ ఫ్యాక్టర్‌తో పాటు భారత బౌలర్ల వైఫల్యం, చెత్త ఫీల్డింగ్ టీమిండియా కొంపముంచింది. ముఖ్యంగా హర్షిత్ రాణా(1/70), ప్రసిధ్ కృష్ణ(2/85)ల పేలవ బౌలింగ్ భారత్ పతనాన్ని శాసించింది. ఓ ఎండ్‌లో అర్ష్‌దీప్ సింగ్(2/54) కట్టడిగా బౌలింగ్ చేస్తే.. మరో ఎండ్‌లో హర్షిత్ రాణా ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కీలక సమయంలో క్యాచ్‌లు వదిలేయడం కూడా సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆఖరి వన్డే వైజాగ్ వేదికగా శనివారం(డిసెంబర్ 6) జరగనుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(2/63) రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(1/43), లుంగి ఎంగిడి(1/51) చెరో వికెట్ తీసారు. అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రిట్జ్‌కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డికాక్(8)ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి మార్క్‌రమ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. అనంతరం దూకుడు పెంచిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో మార్క్‌రమ్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు హాఫ్ సెంచరీ చేరువైన బవుమా(46)ను ప్రసిధ్ కృష్ణ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మాథ్యూ బ్రీట్జ్‌కీతో కలిసి మార్క్‌రమ్ తన జోరును కొనసాగించాడు. ఈ ఇద్దరూ భారీ షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. 88 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న మార్క్‌రమను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డెవాల్డ్ బ్రెవిస్ వచ్చి రావడంతోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓవైపు మాథ్యూ బ్రిట్జ్‌కే నిదానంగా ఆడినా.. మరోవైపు బ్రెవిస్ రెచ్చిపోయాడు. 49 బంతుల్లో బ్రిట్జ్‌కే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. బ్రెవిస్ 33 బంతుల్లోనే అర్థ శతకం అందుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. డెవాల్డ్ బ్రెవిస్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సెంచరీ దిశగా సాగిన మాథ్యూ బ్రిట్జ్‌కేను ప్రసిధ్ కృష్ణ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ కాసేపటికే మార్కో యాన్సెన్(2)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. సిక్సర్‌తో దూకుడు కనబర్చిన టోనీ డీ జోర్జీ(17) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా.. కార్బిన్ బోష్ పోరాడాడు. 47వ ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ 2 పరుగులే ఇచ్చి సఫారీ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. కానీ హర్షిత్ రాణా పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ భారత్ చేజారింది. ప్రసిధ్ కృష్ణ ఆఖరి ఓవర్‌లో కార్బిన్ బోష్(27 నాటౌట్) బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.