టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా చిక్కుల్లో పడ్డాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో అత్యుత్సాహం ప్రదర్శించిన హర్షిత్ రాణాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది.
హర్షిత్ రాణా
టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా చిక్కుల్లో పడ్డాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో అత్యుత్సాహం ప్రదర్శించిన హర్షిత్ రాణాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఐసీసీ రూల్స్‌కు విరుద్దంగా ప్రవర్తించినందుకు గట్టిగా మందలించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. రాంచీ వేదికగా గత ఆదివారం జరిగిన తొలి వన్డేలో హర్షిత్ రాణా ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేసిన తర్వాత అతిగా సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ తీసి పెవిలియన్‌కు వెళ్లిపోవాలంటూ సైగలు చేశాడు. ఈ ఓవరాక్షన్‌పై అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. ఈ నేరాన్ని హర్షిత్ రాణా అంగీకరించడంతో వార్నింగ్‌తో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘గత 24 నెలల్లో హర్షిత్ రాణాకు ఇది డీమెరిట్ పాయింట్. ఈ కుడిచేతి వాటం పేసర్ తన తప్పిదాన్ని అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ విధించిన శిక్షకు సమ్మతం తెలిపాడు. హర్షిత్ రాణా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్లేయర్స్ అండ్ ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.5 రూల్‌ను ఉల్లంఘించాడు. ఈ రూల్ ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాటర్ ఔటైనప్పుడు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం, సైగలు చేయడం చేయవద్దు’అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.