యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ రెండో టెస్ట్‌లో జో రూట్ అజేయ శతకంతో చెలరేగాడు.
ప్రతీకాత్మక చిత్రం
6 వికెట్లు తీసిన స్పీడ్‌స్టర్
జో రూట్ అద్భుత సెంచరీ
325/9 వద్ద ఇంగ్లండ్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ రెండో టెస్ట్‌లో జో రూట్ అజేయ శతకంతో చెలరేగాడు. ఆస్ట్రేలియా గడ్డపై జోరూట్‌కు ఇదే తొలి శతకం కావడం గమనార్హం. టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు 40 శతకాలు సాధించిన జోరూట్.. ఆస్ట్రేలియాపై మూడెంకల స్కోర్ అందుకునేందుకు ఇన్నాళ్లు నిరీక్షించాడు. కెరీర్‌లో లోటుగా మారిన ఈ సెంచరీని సాధించేందుకు జోరూట్‌కు తాజా పర్యటనలో మూడు ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన జోరూట్.. పింక్ బాల్ టెస్ట్‌లో తన ట్రేడ్ మార్క్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మిచెల్ స్టార్క్ ధాటికి ఆదిలోనే బెన్ డకెట్, ఓలీ పోప్ డకౌటవ్వగా.. జాక్ క్రాలీ(76)తో కలిసి జోరూట్ జట్టును ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. జాక్ క్రాలీ వెనుదిరిగినా.. హ్యారీ బ్రూక్(31), బెన్ స్టోక్స్(19), విల్ జాక్స్(19), జోఫ్రా ఆర్చర్(32 బ్యాటింగ్)ల సాయంతో విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలో 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోరూట్.. 181 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా గడ్డపై 1000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై 30 ఇన్నింగ్స్‌లు ఆడిన జోరూట్ 1006 పరుగులు చేశాడు. ఇందులో తాజా సెంచరీతో పాటు 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జోరూట్‌కు ఇది 22వ సెంచరీ. ఇప్పటికే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జోరూట్.. తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. మరే బ్యాటర్ కూడా అతనికి దరిదాపుల్లో లేడు. డబ్ల్యూటీసీ చరిత్రలో 129 ఇన్నింగ్స్‌లు ఆడిన జోరూట్ 22 శతకాలు చేయగా.. స్టీవ్ స్మిత్ 13, మార్నస్ లబుషేన్ 11, కేన్ విలియమ్సన్ 11, శుభ్‌మన్ గిల్ 10 సెంచరీలతో తర్వాతి స్థానంలో నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ల జాబితాలో జోరూట్(59*) అగ్రస్థానంలో కొనసాగతుండగా.. అలిస్టర్ కుక్(38), కెవిన్ పీటర్సన్(32), గ్రహమ్ కోచ్(28), ఆండ్రూ స్ట్రాస్(27) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(84), రికీ పాంటింగ్(71), కుమార సంగక్కర(63), జాక్వాస్ కల్లీస్(62), జోరూట్(59*) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జోరూట్ సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 74 ఓవర్లలో 9 వికెట్లకు 325 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్(135 బ్యాటింగ్), జోఫ్రా ఆర్చర్(32 బ్యాటింగ్) ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/71) ఆరు వికెట్లు తీయగా.. మైఖేల్ నెజర్, స్కాట్ బోలాండ్ తలో వికెట్ తీసారు.