డీఆర్డీవో ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో గొప్ప విజయాన్ని సాధించింది. యుద్ధ విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్‌ ప్రాణాలను కాపాడే ఎస్కేప్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.

drdo emergency exit in chandigarhh

ప్రతీకాత్మక చిత్రం

చండీగఢ్‌లోని రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ ఫెసిలిటీలో ప్రయోగం

చండీగఢ్: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో గొప్ప విజయాన్ని సాధించింది. యుద్ధ విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్‌ ప్రాణాలను కాపాడే ఎస్కేప్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. భారత వైమానిక దళ పైలట్ల భద్రతను మరింత పటిష్ఠం చేసే ఈ పరీక్ష ప్రయోగంలో సక్సెస్ అయ్యింది. ఈ విజయంతో, సంక్లిష్టమైన పరీక్షాసామర్థ్యం కలిగిన అగ్రదేశాల సరసన భారత్ చేరింది. చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబ్ ఆధ్వర్యంలోని రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ కేంద్రంలో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో ఈ పరీక్షను నిర్వహించారు. విమానం పైకప్పు వేరుపడటం, పైలట్‌ను బయటకు పంపే క్రమం, పైలట్ సురక్షితంగా కిందకు చేరే విధానం.. వంటి చర్యలు చేపట్టి విజయం సాధించారు. ఈ పరీక్ష కోసం తేజస్ యుద్ధ విమానం ముందు భాగాన్ని పోలిన ఒక డ్యుయల్ స్లైడ్ వ్యవస్థను ఉపయోగించారు. రాకెట్ మోటర్ల సహాయంతో దీనికి నియంత్రిత వేగాన్ని అందించి, వాస్తవ పరిస్థితులను సృష్టించారు. పైలట్ స్థానంలో ప్రత్యేక సెన్సర్లు అమర్చిన ఆంత్రోపోమార్ఫిక్ టెస్ట్ డమ్మీని ఉంచి, ప్రమాద సమయంలో పైలట్‌పై పడే ఒత్తిడి, వేగాన్ని నమోదు చేశారు. ఈ మొత్తం ప్రక్రియను హై-స్పీడ్ కెమెరాలు చిత్రీకరించాయి. స్టాటిక్ టెస్టులతో పోలిస్తే ఇలాంటి పరీక్షలు చాలా క్లిష్టమైనవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


మా వల్ల కాదు!... ఐసీసీకి జియోహాట్‌స్టార్ షాక్..
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్