తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.
రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు అవ్వండి
2034 నాటికి ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లే లక్ష్యం
గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 8 (ఈవార్తలు): తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలు తమకు ఆదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్ తిరుగులేనిది.. అందరూ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభ ప్లీనరీలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాతలను ఆదర్శంగా తీసుకొని, నిపుణులు, ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్–2047 కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా... 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం వ్యూహాత్మకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.‘కష్టమైతే వెంటనే చేస్తాం, అసాధ్యమైతే కొంత గడువు తీసుకొనైనా సాధించి తీరుతాం’అనే ధోరణితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.‘తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్’ అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
క్యూర్, ప్యూర్, రేర్
‘దేశానికి స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకుని ఉత్సవాలు చేసుకునే 2047 నాటికి యువ రాష్ట్రమైన తెలంగాణ ఏం సాధించగలదని నిపుణులతో ఆలోచన చేసినప్పుడు తెలంగాణ రైజింగ్ 2047 ఆలోచనలకు బీజం పడింది. భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్ణయించుకుని సాధించాలని సంకల్పించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో దేవుళ్ల ఆశీర్వాదం తీసుకోవడం, ప్రజల మద్దతు, సహకారం కోరడం మా సంప్రదాయం’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.‘తెలంగాణ భవిష్యత్తు కోసం రూపొందించుకున్న విజన్ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాన్ని సేవా రంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం.. అన్న మూడు ప్రాంతాలుగా విభజన చేశాం. ఈ మూడు ప్రాంతాల్లో స్పష్టమైన విధానాలతో దేశంలోనే తెలంగాణను మొట్ట స్థానంలో నిలపాలన్న లక్ష్యాలను నిర్దేశించాం. వాటినే క్యూర్, ప్యూర్, రేర్ అన్న మూడు ప్రత్యేక మండళ్లుగా విభజన చేశాం’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
లక్ష్యాల రూపకల్పనలో ప్రజాభిప్రాయం
‘ఈ లక్ష్యాల రూపకల్పనలో ప్రజల నుంచి అభిప్రాయాలను కోరాం. వారి అంచనాలు, ఆలోచనలు, కలలను మాతో పంచుకున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సహాయ, సహకారాలను తీసుకున్నాం. తెలంగాణ రైజింగ్ దార్శనికతను రూపొందించడంలో సహాయ పడినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ రకంగా నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా బృహత్తరమైన సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు ఇందులో పాలుపంచుకోవడం తెలంగాణ అదృష్టంగా భావిస్తున్నాం అని సీఎం తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతల నుంచి ప్రేరణ పొందాం
‘వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ నిపుణులు హాజరైన ఈ రెండు రోజుల సమ్మిట్‌లో మీరందించే సలహాలు, ఆలోచనలు, అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరిస్తుంది’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘1947 ఆగస్టు 15 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు మన నాయకులు దేశాన్ని ముందుకు నడిపించడానికి దూరదృష్టితో ఆలోచనలు చేశారు. ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి చర్చోపచర్చల అనంతరం ప్రజాస్వామిక, సార్వభౌమ, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ భవిష్యత్తుగా ఒక రోడ్ మ్యాప్ వేయాలని భావించిన మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లతో పాటు రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతోమంది నుంచి మేము ప్రేరణ పొందాం’అని రేవంత్ వెల్లడించారు.
దేశంలో తెలంగాణ యువరాష్ట్రం
‘తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014లో సోనియా గాంధీ,నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ కలను సాధించుకున్నాం. దేశంలో ఒక కొత్త యువ రాష్ట్రంగా అవతరించింది. అలాంటి తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. దేశంలో తెలంగాణ యువ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఎంతో పెట్టుబడులకు సానుకూల వాతావరణం, ఎన్నో అవకాశాలున్నాయి’ అని సీఎం వివరించారు.
చైనాలోని గ్వాంగ్ - డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తి
‘2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం. దేశ జనాభాలో తెలంగాణ దాదాపు 2.9% కలిగి ఉంది. జాతీయ జీడీపీలో దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి, దేశ జీడీపీలో 10% వాటాను తెలంగాణ అందించే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఈ సందర్భంగా ఒక ఉదాహరణను ప్రస్తావించదలచుకున్నాను. చైనాలోని గ్వాంగ్ - డాంగ్ ప్రావిన్స్ గురించి ఉదహరిస్తా. గ్వాంగ్ డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ఇతర ప్రావిన్స్‌కైనా అతిపెద్దది.20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులు సాధించడమే కాకుండా వృద్ధిని సాధించారు’ అని రేవంత్ చెప్పారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలు సాధిస్తాం
‘తెలంగాణలో మేము కూడా ఆ నమూనాను అందిపుచ్చుకోవాలని నిర్ణయించాం. మేం చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి ప్రేరణ పొందాం. మేమిప్పుడు ఆ దేశాలతో పోటీ పడదలచుకున్నాం. అందుకోసం తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించాలని, పెట్టుబడులు పెట్టాలని, మాకు మద్దతు ఇవ్వడానికి వారిని ఆహ్వానించాం’అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలు కొంత కష్టంగా అనిపించవచ్చు. కానీ వాటిని సాధించగలమన్న విశ్వాసం మాకుంది. ఈ విషయంలో మా బృందానికి చెబుతున్నదేమంటే.. కష్టంగా ఉంటే దాన్ని వెంటనే చేసి చూపిద్దాం. మీరది అసాధ్యమని భావిస్తే మరికొంత గడువిస్తాను. నిన్నటికంటే ఈరోజు నాలో మరింత నమ్మకం పెరిగింది. నిన్నటి రోజున అదొక కల, ఒక ప్రణాళిక. ఇప్పుడు మీరంతా మాకు మద్దతుగా నిలిచారు. దృఢసంకల్పంతో సాగిస్తున్న మా ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాం. మీ అందరి మద్దతు, సహకారంతో లక్ష్యాలను సాధించగలం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలతో సాగుతున్న తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు. ఒక మంచి సంకల్పంతో వేసిన ఈ ముందడుగులో మా లక్ష్యాలను సాధించడానికి మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.