కర్ణాటక రాజకీయాల్లో 'బ్రేక్‌ఫాస్ట్ డిప్లమసీ' ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విభేదాలున్నాయనే ప్రచారానికి తెరదించేలా, వారం వ్యవధిలోనే వీరిద్దరూ రెండోసారి సమావేశం కానున్నారు.
సిద్ధరామయ్య డీకే శివకుమార్
నాటుకోడి కూరతో సీఎంకు డీకే విందు
వారంలో రెండోసారి భేటీ కానున్న ఇరువురు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో 'బ్రేక్‌ఫాస్ట్ డిప్లమసీ' ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య విభేదాలున్నాయనే ప్రచారానికి తెరదించేలా, వారం వ్యవధిలోనే వీరిద్దరూ రెండోసారి సమావేశం కానున్నారు. ఈసారి డీకే శివకుమార్ తన నివాసంలో డిసెంబర్ 2న (మంగళవారం) అల్పాహార విందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆహ్వానించారు. ఈ విషయాన్ని సోమవారం డీకే శివకుమార్ 'ఎక్స్' వేదికగా స్వయంగా ప్రకటించారు. "కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మా ఉమ్మడి ప్రయత్నాలను మరింత బలోపేతం చేసేందుకు, రేపు ఉదయం గౌరవ ముఖ్యమంత్రిని అల్పాహారం కోసం నా నివాసానికి ఆహ్వానించాను" అని ఆయన పేర్కొన్నారు. తామిద్దరం ఒకే బృందంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిద్ధరామయ్యకు అత్యంత ఇష్టమైన 'నాటుకోడి' వంటకాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అంతకుముందు సోమవారం ఉదయం విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య, తనకు ఇంకా డీకే నుంచి ఆహ్వానం అందలేదని, కానీ పిలిస్తే తప్పకుండా వెళతానని తెలిపారు. "గత సమావేశంలోనే డీకే తన ఇంటికి రమ్మని చెప్పారు. ఆయన కచ్చితంగా ఆహ్వానిస్తారని నేను భావిస్తున్నాను" అని సీఎం వ్యాఖ్యానించారు. నవంబర్ 30న సీఎం నివాసంలో జరిగిన తొలి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ తర్వాత కూడా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తామిద్దరం కలిసే ఉన్నామని, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న ఊహాగానాల ఒత్తిడి కారణంగానే తాము ఇలా సమావేశం కావాల్సి వస్తోందని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వరుస సమావేశాలు కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి మద్దతుతో జరుగుతున్నట్లు తెలుస్తోంది.