ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు.
కోమటిరెడ్డి
వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: వాకిటి
సారీ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం: కోమటిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న 'తలతిక్క మాటలు' వెంటనే మానుకోవాలని, లేకపోతే తెలంగాణలో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పవన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించారు. ‘పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. తెలంగాణలోని ఒక్క థియేటర్‌లో కూడా ఆయన సినిమా విడుదల కాదు’ అని స్పష్టం చేశారు. పవన్ కామెంట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రెండు రాష్ట్రాల మధ్య సౌహార్ద వాతావరణాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ‘మీ సముద్రం నుంచి వచ్చే తుపాను మా రాష్ట్రాన్ని ముంచేస్తున్నా మేమెవరినీ తప్పుబట్టలేదు. అది ప్రకృతి అని భావించాం. కానీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా? కోనసీమపై మేమెందుకు దిష్టి పెడతాం?’ అని నిలదీశారు