రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘనస్వాగతం లభించింది. పాలెం ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్ పక్కనబెట్టి పుతిన్‌కు స్వాగతం పలికారు.
పుతిన్, మోదీ
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘనస్వాగతం లభించింది. పాలెం ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్ పక్కనబెట్టి పుతిన్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరేటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఇద్దరు ప్రపంచ నాయకులు ఇలా కలిసి ప్రయాణించడం అనేది భారత్-రష్యా స్నేహబంధం ఎంత బలంగా ఉందో చెప్పకనే చెబుతోంది. ఇద్దరు నాయకులు ఒకే వాహనంలో ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు. ఇది ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత బంధాన్ని, దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని సూచిస్తుంది. సెప్టెంబర్‌లో చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా కూడా మోదీ, పుతిన్ ఒకే వాహనంలో ప్రయాణించారు. ఆ సమయంలో అమెరికా భారత్‌పై భారీగా టారీఫ్స్ విధించింది. అటువంటి తరుణంలో మోదీ-పుతిన్ ఒకే కారులో వెళ్లడం.. ప్రపంచ దేశాలకు సరికొత్త సంకేతాన్ని పంపించినట్లు అయ్యింది. మరోవైపు, పుతిన్ భారత పర్యటనను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. పుతిన్ విమానం ఢిల్లీలో ల్యాండ్ కావడానికి ముందు ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ రాడార్ 24 ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేయబడిన విమానంగా పుతిన్ విమానం నమోదైందని పేర్కొంది.
భగవద్గీత బహూకరణ
రష్యన్ భాషలోకి అనువదించిన భగవద్గీత పుస్తకాన్ని పుతిన్‌కు మోదీ అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం భగవద్గీత అని పేర్కొన్నారు