ఇట్స్ పార్టీ టైం

తెలంగాణ పల్లెల్లో ఏం నడుస్తోంది.. అంటే ఎవర్ని అడిగినా ఇట్స్ పార్టీ టైం అంటున్నారు. స్థానిక సమరం రసవత్తరంగా, ఖరీదైన వ్యవహారంగా మారింది. సాయంత్రం అయితే చాలు, మామిడి తోటలు, పొలాల గట్లపై దావత్‌లు జోరందుకుంటున్నాయి.

party time in vilages

ప్రతీకాత్మక చిత్రం


మధ్యాహ్నం దాకా బిర్యానీ పార్టీలు

సాయంత్రమైతే మందు దావత్‌లు

మద్యం, స్టఫ్.. ఓటర్లకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ

మందు తాగనోళ్లకు పైసల పంపిణీ

సర్పంచ్ అభ్యర్థులకు మోపెడు ఖర్చు

(ఈవార్తలు ప్రత్యేకం)

తెలంగాణ పల్లెల్లో ఏం నడుస్తోంది.. అంటే ఎవర్ని అడిగినా ఇట్స్ పార్టీ టైం అంటున్నారు. స్థానిక సమరం రసవత్తరంగా, ఖరీదైన వ్యవహారంగా మారింది. సాయంత్రం అయితే చాలు, మామిడి తోటలు, పొలాల గట్లపై దావత్‌లు జోరందుకుంటున్నాయి. సర్పంచ్ పదవి కోసం పోటీపడుతున్న అభ్యర్థులు లక్షలు ఖర్చుపెడుతూ, ఓటును కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదు. మద్యం ఏరులై పారుతోంది. చికెన్, మటన్ స్టఫ్‌తో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

ఎన్నికల పోలింగ్ తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ, పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి విందులు, వినోదాలు, మద్యం, మాంసాహారంతో కోలాహలం సృష్టిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, గ్రామాల్లో బాహాటంగానే మందు పార్టీలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నవంబర్ 25 నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నా, గ్రామస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సర్పంచ్ పదవికి రాజకీయ పార్టీల చిహ్నాలు లేనప్పటికీ, ప్రధాన పార్టీల మద్దతుదారులు బరిలో దిగడంతో రాజకీయం తారస్థాయికి చేరింది. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక అంటే ఆషామాషీ కాదు. ఇది ప్రతిష్టాత్మక పోరు. అభ్యర్థులు తమ బలం, బలగం చూపించుకోవడానికి విందులను ఆయుధంగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా, నామినేషన్ల ప్రక్రియ ముగిసి, గుర్తుల కేటాయింపు జరిగిన తర్వాత ఈ 'పార్టీ'ల సంస్కృతి పతాక స్థాయికి చేరుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండటంతో, అభ్యర్థులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తమ మామిడి తోటలు, పొలాలు, లేదంటే ఊరికి దూరంగా ఉన్న ఫామ్‌హౌస్‌లను విందులకు వేదికలుగా చేసుకుంటున్నారు. విందుల్లో చికెన్, మటన్, చేపలు కామన్‌గా మారిపోయాయి. వీటితో పాటు మద్యం బాటిళ్లు ఇతర స్టఫ్ సమకూరుస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఏ ఖర్చుకైనా వెనుకాడడం లేదు. కేవలం విందులే కాకుండా, ఓటుకు కొంత మొత్తం పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అక్కడక్కడ తనిఖీలు చేసి, మద్యం పట్టుకుంటున్నా, అభ్యర్థులు కొత్త దారులు వెతుకుతున్నారు. అధికార పార్టీ నేతలు కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. అయితే, సర్పంచులు పదవి కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నిధులు రాక అప్పులపాలై కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చర్చకు వస్తున్నాయి.  కాగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది, అదే రోజు సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానున్నాయి.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్