ప్రజాద్రోహుల పాలన... ఉన్నతోధ్యోగులుగా తెలంగాణ ద్రోహులే...

‘నీది ప్రజాపాలనా?.. తెలంగాణ ద్రోహుల పాలన’ అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ శాఖలో మొత్తం ఉన్నతాధికారులుగా తెలంగాణ ద్రోహులనే నియమిస్తుందని మండిపడ్డారు.

harish rao

హరీశ్ రావు

సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ధ్వజం

హైదరాబాద్, డిసెంబర్ 1 (ఈవార్తలు): ‘నీది ప్రజాపాలనా?.. తెలంగాణ ద్రోహుల పాలన’ అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ శాఖలో మొత్తం ఉన్నతాధికారులుగా తెలంగాణ ద్రోహులనే నియమిస్తుందని మండిపడ్డారు. ఆ పోస్టులకు తెలంగాణలో సమర్థవంతమైన అధికారులే మీకు దొరకడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పోరాడి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు సాధించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ శాఖలోని పై పోస్టుల్లో ఆంధ్రావాళ్లనే నియమించారని తెలిపారు. జెన్‌కో హైడల్‌ అండ్‌ థర్మల్‌ డైరెక్టర్‌గా రాజశేఖర్‌ రెడ్డిని తీసుకున్నారని తెలిపారు. రాజశేఖర్‌ రెడ్డి సింగరేణిలో పనిచేసి రిటైర్‌ అయ్యాడని.. ఆయనకు విద్యుత్‌ ఉత్పత్తిలో ఎలాంటి అనుభవం లేదని పేర్కొన్నారు. జెన్‌కో సంస్థలో తెలంగాణ ఉద్యమాన్ని సమైక్యవాది కుమార్‌ రాజా అవమానిస్తే.. విద్యుత్‌ ఉద్యోగులు అతన్ని తరిమితరిమి కొట్టారని తెలిపారు. అలాంటి కుమార్‌ రాజాను తీసుకొచ్చి నేడు విద్యుత్‌ ఉద్యోగుల మీద పెత్తనం చేసేందుకు డైరెక్టర్‌గా నియమించారని మండిపడ్డారు. ఇది ప్రజాపాలనా? తెలంగాణ ద్రోహుల పాలనా? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో మైనింగ్‌ ఇంజనీర్‌గా పనిచేసిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన శివాజీని ఎస్పీడీసీఎల్‌లో కీలకమైన పోస్టులో నియమించారని హరీశ్‌రావు తెలిపారు. అనుభవజ్ఞులైన ఐదారుగురు దళిత రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్లు ఉన్నా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ గడ్డపై పనిచేయని ఏపీ వ్యక్తి నర్సింహులును ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌గా పెట్టారని తెలిపారు. రెడ్కో సంస్థ సీఎండీగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన జూనియర్‌ మోస్ట్‌ డీఈ వావిలాల అనీలను నియమించారని అన్నారు. తెలంగాణలో సమర్థవంతమైన అధికారులు మీకు దొరకడం లేదా అని సీఎం రేవంత్‌ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. అనేకమంది తెలంగాణ దళితబిడ్డలు సమర్థులైన అధికారులు ఉన్నారని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ వాళ్లు నడుపుతున్నారా? ఆంధ్రా పాలకులు నడుతుపున్నారా అని ప్రశ్నించారు. చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా అవినీతిపరుడైన ఆంధ్రా వ్యక్తిని నియమించారని అన్నారు. అతను గ్రీన్‌ ఎనర్జీ అప్లికేషన్‌ ఫీజు రూ.25వేల చొప్పున రూ.600 కోట్లు వసూలు చేశారని తెలిపారు. చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫీసు మెగావాట్‌కు రూ.25లక్షలు అడిగారని తెలిపారు. పైవాళ్లకు కూడా ఇవ్వాలని రూ.30 లక్షలకు రేటు పెంచారని అన్నారు. ఇంకా లంచాల లెక్కతేలక ఆర్నెల్ల నుంచి పెండింగ్‌లో పెట్టారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఎలక్ట్రిసిటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఆంధ్రా అధికారులను తొలగించి తెలంగాణ వాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్