భారతదేశ అభివృద్ధి కథను లోతుగా పరిశీలిస్తే గ్రామాలే దేశపు నిజమైన పునాది అని స్పష్టం అవుతుంది. అనేక శతాబ్దాలుగా గ్రామ సమాజం సంప్రదాయ వ్యవస్థల ఆధారంగా స్వయం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. అయితే ఆధునిక అర్థంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు రూపం అందింది స్వాతంత్ర్యం అనంతరమే
పంచాయతీరాజ్ వ్యవస్థ
భారతదేశ అభివృద్ధి కథను లోతుగా పరిశీలిస్తే గ్రామాలే దేశపు నిజమైన పునాది అని స్పష్టం అవుతుంది. అనేక శతాబ్దాలుగా గ్రామ సమాజం సంప్రదాయ వ్యవస్థల ఆధారంగా స్వయం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. అయితే ఆధునిక అర్థంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు రూపం అందింది స్వాతంత్ర్యం అనంతరమే. నిజానికి గ్రామ స్వరాజ్యం అన్న ఆలోచన భారతీయుల మనసుల్లో చాలా పురాతనకాలం నుంచే ఉంది. వేదకాలపు సభలు, సమితులు గ్రామ స్థాయి పరిపాలనలో కీలక పాత్ర పోషించాయి. కానీ రాజ్యాంగబద్ధంగా గ్రామ స్వయం పాలనకు శక్తివంతమైన పునాది పడింది 20వ శతాబ్దంలోనే.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన భాగంగా చేయాలని సూచించారు. ఆయన అభిప్రాయం ప్రకారం గ్రామమే ప్రజాస్వామ్యపు ప్రాథమిక యూనిట్ అయి ప్రజలే తమ స్థానిక సమస్యలను తీర్చుకోవాలనే దృఢ ఆలోచన ఉండాలి. కానీ ప్రారంభంలో దేశం దళితులపై అన్యాయం, అక్షరాస్యత లోపం, వనరుల కొరత వంటి సమస్యలతో సతమతమై గ్రామ స్వయం పాలనకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యం కాలేదు. 1952,1953 సంవత్సరాల్లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మరియు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ ఇవి అధికారులు ఆధారిత పద్ధతిలో నడుస్తుండటంతో గ్రామస్థులకు ప్రత్యక్ష భాగస్వామ్యం తక్కువగానే ఉండేది. దాంతో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అవసరమని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో 1957లో బాలవంతరాయ్ జే. మెహతా కమిటీని నియమించారు. ఈ కమిటీ సిఫారసులు భారత రాజకీయ పరిపాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మలుపు తీసుకొచ్చాయి. ఈ కమిటీ గ్రామ పంచాయతీ, మండల/పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ అనే మూడు స్థాయిల పంచాయతీరాజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇది గ్రామ స్వరాజ్యానికి పునాది వేసిన తొలి అధికారిక బ్లూప్రింట్. ఈ సిఫారసుల ఆధారంగా 1959 అక్టోబర్ 2న రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను దేశంలో అధికారికంగా ప్రారంభించారు. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేయడం ప్రారంభించాయి. ఈ దశలో గ్రామ స్వయం పాలనకు రూపం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ పరిస్థితులు, నిధుల లోపం, ప్రజాస్వామ్య వ్యవస్థల బలహీనత వంటి కారణాలతో పంచాయతీరాజ్ సంస్థలు బలపడలేదు. ఈ సమస్యలను సరిచేసి గ్రామ స్వయం పాలనకు రాజ్యాంగబద్ధత ఇవ్వాల్సిన అవసరం పెరిగింది. ఈ దిశగా 1977లో అశోక్ మెహతా కమిటీ, 1985లో జి.వి.కే రావు కమిటీ, 1986లో ఎల్.ఎం సింఘ్వి కమిటీ వంటి అనేక కమిటీలు ఏర్పడి స్థానిక స్వయం పాలన బలపడాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పాయి. ముఖ్యంగా ఎల్.ఎం సింఘ్వి కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని బలంగా సిఫారసు చేయటంతో గ్రామ స్వరాజ్యం ఉద్యమానికి జాతీయ స్థాయి స్పష్టత లభించింది.చివరికి 1992లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామ స్వయం పాలనకు చారిత్రాత్మక శక్తిని ప్రసాదించింది. ఈ చట్టం 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చి భారత గ్రామ జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. ఈ సవరణ 9 భాగం, 11వ షెడ్యూల్ జోడించి గ్రామ పంచాయతీలకు స్పష్టమైన అధికారాలు, నియమబద్ధత, రిజర్వేషన్లు, స్వతంత్ర గ్రామ ఎన్నికల సంఘం, ఆర్థిక కమిషన్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ సవరణతో సర్పంచ్ స్థానం ప్రజాస్వామ్య నిర్మాణంలో కీలకంగా మారింది. 11వ షెడ్యూల్‌లోని 29 అంశాలు గ్రామ పంచాయతీల ద్వారా అమలయ్యే ప్రాంతీయ ప్రణాళికలకు పునాది అయ్యాయి.
73వ సవరణ తరువాత గ్రామ సభ, గ్రామ పంచాయతీ, మండల సమితి, జిల్లా పరిషత్ స్థాయిలలో నిర్ణయాలు తీసుకునే విధానం మరింత ప్రజాస్వామ్యబద్ధమైంది. గ్రామ సభ ఇప్పుడు గ్రామ ప్రజల పర్యవేక్షణాధికారిగా మారింది. గ్రామంలో ఎవరి సమస్య అయినా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమమైనా గ్రామ సభ అనుమతి లేకుండా జరిగే స్థితి తగ్గింది. అలాగే మహిళలకు, షెడ్యూల్డ్ కాస్టులు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు రిజర్వేషన్లు కల్పించటం వల్ల గ్రామ నాయకత్వం విస్తృత ప్రజా వర్గాల్లోకి విస్తరించింది. మహిళల నాయకత్వం గ్రామ అభివృద్ధిలో కొత్త దిశను తెచ్చింది. గ్రామ స్వరాజ్యంలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమైనది. సర్పంచ్ కేవలం గ్రామ పంచాయతీకి అధ్యక్షుడు కాదు గ్రామ అభివృద్ధికి ప్రధాన శక్తి. ఆయన దృష్టి గ్రామ భవిష్యత్తును నిర్ధారిస్తుంది. 1959లో పంచాయతీరాజ్ స్థాపన నుండి 2023 వరకు జరిగిన అనేక అభివృద్ధి అధ్యయనాలు చూపిస్తున్నాయి విజన్ ఉన్న సర్పంచ్ ఉంటే గ్రామాలు మూడు నుండి నాలుగు సంవత్సరాల్లోనే ఆదర్శ గ్రామాలుగా మారిన అనేక ఉదాహరణలు కనిపించాయి. ముఖ్యంగా నీటి సంరక్షణ, రహదారుల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి, మలినాల శుభ్రత, డిజిటల్ సేవల ప్రవేశపెట్టడం, పచ్చదనం పెంపు వంటి రంగాల్లో సర్పంచ్ నాయకత్వం గ్రామ ప్రగతిని నేరుగా వేగవంతం చేస్తుంది.దేశవ్యాప్తంగా 2021 గణాంకాల ప్రకారం 2.6 లక్షలకుపైగా గ్రామ పంచాయతీలు కార్యకలాపాల్లో ఉన్నాయి. వీటిలో పది లక్షల కంటే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు స్థానిక స్వయం పాలనలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో మహిళా సర్పంచ్‌లు మూడో వంతుకు పైగా ఉన్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోనే అతి పెద్ద గ్రామీణ ప్రజాస్వామ్య వ్యవస్థను చూపిస్తుంది. ఇది గ్రామ స్వరాజ్యం భారతదేశంలో ఎంత ప్రగాఢంగా వేరు వేసిందో సూచిస్తుంది.
ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యానికి శక్తివంతమైన పునాది. ఇది కేవలం పరిపాలనా యంత్రాంగం కాదు దేశపు సామాజిక ఆర్థిక రాజకీయ పురోగతికి ప్రాథమిక బలం. గ్రామ స్వయం పాలన బలపడితే దేశ ప్రజాస్వామ్యం బలపడుతుంది. సర్పంచ్ నాయకత్వం పటిష్టమైతే గ్రామ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. పంచాయతీ రాజ్ బలమైనప్పుడు దేశం మొత్తం అభివృద్ధిని అనుభవిస్తుంది. అంతిమంగా పంచాయతీరాజ్ వ్యవస్థ భారత ప్రజాస్వామ్యానికి నేలమట్టం స్థాయి నుంచి శక్తి పోస్తూ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా సాకారం చేసే మార్గాన్ని చూపుతోంది. గ్రామం బలపడితే దేశం బలపడుతుంది అనే సత్యం ప్రతి దశలోనూ మరింత స్పష్టమవుతోంది. సర్పంచ్ చేతిలోని చిన్న నిర్ణయం కూడా ఒక గ్రామ భవిష్యత్తును మార్చగల శక్తి కలిగి ఉండటంతో ఈ వ్యవస్థ దేశ నిర్మాణంలో కీలక బలమైన మూలస్తంభంగా నిలుస్తోంది. అభివృద్ధి లేని గ్రామం వెనుకబడిన దేశానికి ప్రతీక అయితే అభివృద్ధి చెందిన గ్రామం పురోగమించే దేశానికి దిశను చూపే దివిటిలా ఉంటుంది. స్థానిక స్వయం పాలన బలపడి ప్రతి గ్రామంలో సమానత్వం, పారదర్శకత, బాధ్యత అనే విలువలు మరింత పాతుకుపోతే భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి వెలుగునిచ్చే ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామాల్లో స్వావలంబన పెరిగి, యువత భాగస్వామ్యం విస్తరించి, మహిళా నాయకత్వం బలపడితే గ్రామ స్వరాజ్యం కేవలం సిద్ధాంతం కాదు శాశ్వత సత్యంగా మారుతుంది. ఈ భావన ఆవిష్కరించే శక్తి పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఉండటం దానిని భారత జాతి పునర్నిర్మాణానికి అత్యంత విశ్వసనీయ పునాదిగా నిలబెడుతోంది.పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ ప్రజల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసి వారి చేతుల్లోనే అభివృద్ధి శక్తిని ఉంచుతుంది. గ్రామస్థులు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే స్థితికి చేరడమే నిజమైన స్వరాజ్యానికి తొలి అడుగు అవుతుంది. ప్రతి గ్రామం ఆత్మనిర్భరత దిశగా ప్రయాణించి పౌరుల భాగస్వామ్యంతో ముందుకు సాగితే భారతదేశం సామాజిక ఆర్థిక రంగాలలో అప్రతిహతమైన పురోగతిని సాధిస్తుంది. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం బలపడితే జాతీయ జీవితంలో సమగ్రత, సమతా భావం, శాంతి వాతావరణం మరింత విస్తరిస్తాయి. ఈ విధంగా పంచాయతీరాజ్ మార్గం గ్రామ స్వరాజ్యాన్ని మాత్రమే కాదు భారత జాతి భవిష్యత్తును కూడా స్థిరతతో ముందుకు నడిపే శక్తిగా నిలుస్తుంది.
- డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం