ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్ తెస్తానని సీఎం రేవంత్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన 'ప్రజా పాలన విజయోత్సవాల' సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి
మాకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేస్తున్నాం
ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్, డిసెంబర్ 4 (ఈవార్తలు): ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్ తెస్తానని సీఎం రేవంత్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన 'ప్రజా పాలన విజయోత్సవాల' సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. సంక్షేమం-అభివృద్ధి అనే రెండు కళ్లతో రాష్ట్ర పురోగతికి కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసులోనే ప్రజలు తనకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చారని, వారి నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయబోమని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత పదేళ్ల పాలనలో నిరంకుశత్వం రాజ్యమేలిందని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు, సచివాలయానికి కూడా రానివ్వలేదని సీఎం గుర్తు చేశారు. ఈ ధోరణిని ప్రజలు గమనించి.. ఓటును ఆయుధంగా మార్చి ఆ ప్రభుత్వాన్ని కూల్చి.. ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని.. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధికి తానే బాధ్యత వహిస్తానని సీఎం ప్రకటించారు.ఆదిలాబాద్ ప్రజలకు అత్యంత ముఖ్యమైన శుభవార్తను ప్రకటిస్తూ.. ఏడాది తిరిగే లోపు జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ‘ఆదిలాబాద్‌కు ఎర్రబస్సులు కాదు.. ఎయిర్ బస్సును తీసుకొస్తా’ అని ఆయన ప్రజలకు మాటిచ్చారు. అటు.. గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని లూటీ చేసిందని.. కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టును నిర్మిస్తే అది కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. ఆ ప్రాజెక్టు కేవలం కొందరి ఇళ్లలో మాత్రం కాసులు కురిపించిందని ఆరోపించారు. కేవలం కమీషన్లు దండుకోవడం కోసమే ఆ ప్రాజెక్టును నిర్మించి.. వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో.. దానికి భిన్నంగా గత పదేళ్ల పాలన సాగిందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 'తెలంగాణ రైజింగ్ - 2047' డాక్యుమెంటరీని రూపొందించినట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో మళ్లీ ఆదిలాబాద్‌కు వచ్చి ఒక రోజంతా ఇక్కడే ఉండి.. సమీక్షలు నిర్వహించి, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించి పోతానని హామీ ఇచ్చారు.