‘రైజింగ్‌’కు రండి!... గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధానికి సీఎం ఆహ్వానం...

హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’కు హాజరుకావాలని ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

 telangana global summit

ప్రతీకాత్మక చిత్రం

మోదీతో రేవంత్, భట్టి భేటీ.. ఖర్గే, రాహుల్‌కూ ఇన్విటేషన్

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’కు హాజరుకావాలని ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ.. గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వానాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే బలమైన దార్శనికతతో ముందుకు సాగుతోందని మోదీకి రేవంత్ తెలిపారు. నీతి ఆయోగ్, వివిధ రంగాల నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు, సహకారాన్ని అందించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు సాధించడంలో, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. రూ. 43,848 కోట్ల అంచనా వ్యయంతో 162.5 కి.మీ.ల మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించిందని... ఈ ప్రాజెక్టును కేంద్రం, రాష్ట్రం మధ్య జాయింట్ వెంచర్‌గా అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్ ఆమోదంతో పాటు ఆర్థిక పరమైన అనుమతులు, అలాగే దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు వరుసల ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి వినతిపత్రం అందించారు. ఇక, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. పలువురు కేంద్ర మంత్రులతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, తదితరులను కలిసి తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌కు ఆహ్వానించారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్