సీఎం రేవంత్ రెడ్డి హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు.
బండి సంజయ్ కుమార్
కరీంనగర్, డిసెంబర్ 2 (ఈవార్తలు): సీఎం రేవంత్ రెడ్డి హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. కాంగ్రెస్ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసే పార్టీ అని ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ.. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషం నింపుకుందని, బీఆర్ఎస్ సైతం గతంలో పలుమార్లు హిందూ దేవుళ్లను, హిందూ సంస్కృతిని కించపర్చిందన్నారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ హిందువులను అవహేళన చేశారని మండిపడ్డారు. తాము ఈ విషయాన్ని ముందే పసిగట్టి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ గెలిస్తే హిందువులు తలెత్తుకొని బయట తిరగలేని ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించినట్లు గుర్తు చేశారు. సీఎం వ్యాఖ్యలను చూశాక ఇదే నిజమని తేలిపోయింది. హిందువుల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ద్వేషం బట్టబయలైంది. హిందూ సమాజం ఇకనైనా ఆలోచించుకోవాలి. ఓట్ల కోసం చీలిపోయి విడివిడిగా ఉంటూ అవహేళనను, అవమానాన్ని దిగమింగుకుంటూ ఉంటారో ఏకమై హిందువుల సత్తాను చాటుతారో తేల్చుకోవాలన్నారు. బీజేపీ ఏనాడూ ఇతర మతాలను కించపరచలేదు. కించపరిచే ఉద్దేశం కూడా లేదని, అన్ని మతాలను గౌరవించే పార్టీ అని, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” దిశగా పని చేస్తోందన్నారు.