చిన్నారులకూ.. చక్కెర గోలీలు!

చిన్నారులకూ.. చక్కెర గోలీలు!

kids diabetes

ప్రతీకాత్మక చిత్రం

- పిల్లల్లో పెరుగుతున్న టైప్-1 డయాబెటిస్

- తగ్గుతున్న బరువు, అధిక మూత్ర విసర్జన

- నిద్రలేమి, నీరసం, చికాకుతో సతమతం

- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు

- తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రమాదకరంగా వ్యాధి

(ఈవార్తలు హెల్త్ డెస్క్)

కరీంనగర్‌ పట్టణానికి చెందిన అరుణ, ప్రవీణ్ (పేర్లు మార్చాం) దంపతులు ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు. వయసు ఆరేళ్లు. ప్రతి రోజు పక్క తడుపుతుండటంతో చిన్న వయసులో కామనే అనుకున్నారు. ఆ మధ్య జ్వరం రావడంతో దవాఖానలో చూపించారు. జ్వరం తగ్గినా, తీవ్ర అలసటతో బాధపడ్డాడు. నిద్ర సరిగా పోవడం లేదు. డౌట్ వచ్చి మళ్లీ డాక్టర్‌ను సంప్రదిస్తే.. మధుమేహం టైప్1 అని తెలిసింది. అతడికి జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిందే.

పిల్లల ఆరోగ్యంలో టైప్-1 డయాబెటిస్ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. చిన్న వయసులోనే ఈ వ్యాధి రావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యాధి తన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలనే నాశనం చేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పుతుంది. వైద్య నిపుణులు దీనిని ఆటోఇమ్యూన్ డిసీజ్‌గా వర్గీకరిస్తున్నారు. టైప్-1 డయాబెటిస్‌ను గతంలో జువెనైల్ డయాబెటిస్ అని పిలిచేవారు. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసే కణాలను శరీర రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడం వల్ల నాశనమవుతాయి. ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. ఇన్సులిన్ లేకుండా గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించలేక రక్తంలో పేరుకుపోతుంది. ఇది హైపర్‌గ్లైసీమియాకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం, ప్రతి సంవత్సరం 96,000 మంది 15 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. సాధారణంగా 4-7 ఏళ్లు లేదా 10-14 ఏళ్ల మధ్య పిల్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో గత దశాబ్దంలో టైప్-1 కేసులు 3-5 శాతం ఏటేటా పెరిగాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనాలు తెలిపాయి. ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఈ కేసులు అధికం అవుతున్నాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరం వేల మంది పిల్లలకు మధుమేహం వస్తోంది. సరైన సమాచారం లేకపోవడం వల్ల ఆలస్యంగా బయటపడుతోంది. అయితే, కొన్ని లక్షణాలతో మధుమేహాన్ని గుర్తించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

తరచూ మూత్ర విసర్జన: రక్తంలో చక్కెర చాలా ఎక్కువగా ఉన్నప్పుడు.. శరీరం మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో రాత్రిపూట తరచుగా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. పిల్లలు రాత్రి సమయాల్లో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తుంటే అప్రమత్తం కావాలి. డయాబెటిస్ ఉంటే నిద్రపోతున్నప్పుడు మంచం తడిపేస్తారు.

అధిక దాహం: అధిక మూత్ర విసర్జన వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీంతో పిల్లలకు అసాధారణంగా దాహం వేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల అధిక దాహం ఏర్పడుతుంది. పిల్లలు అకస్మాత్తుగా అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తే మధుమేహానికి సంకేతం కావచ్చు.

కారణం లేకుండా బరువు తగ్గడం: ఇన్సులిన్ సమస్యల కారణంగా కణాలు గ్లూకోజ్‌ను గ్రహించలేవు. శరీరం శక్తి కోసం కొవ్వును కరిగిస్తుంది. కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో పిల్లలు కారణం లేకుండానే బరువు తగ్గుతారు.టైప్-1 డయాబెటిస్‌లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, టైప్-2 డయాబెటిస్‌లో కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

అలసట/బద్ధకం: కణాలలోకి తగినంత గ్లూకోజ్ ప్రవేశించకుండా, పిల్లల శరీరం శక్తిని కోల్పోతుంది. నిరంతరం అలసట, ఉత్సాహం లేకపోవడం, ఎక్కువగా నిద్రపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే మధుమేహం కావచ్చు.

అధిక ఆకలి: రక్తంలో చక్కెర అధికంగా ఉన్నా, కణాలకు శక్తి ఉండదు. ఇది ఆహారం ఎక్కువ తీసుకునేలా మెదడుకు సంకేతాలను పంపుతుంది. పిల్లలు నిరంతరం ఆకలితో ఉండి, భోజనం చేసిన వెంటనే మళ్లీ ఆహారం అడిగితే తల్లిదండ్రులు డాక్టర్‌ను సంప్రదించడం మేలు.

డయాబెటిస్‌కి కారణాలు:

- పిల్లల్లో మధుమేహం రావడానికి అధిక బరువు లేదా ఊబకాయం ఒక ప్రధాన కారణం కావచ్చు. ఊబకాయం కారణంగా.. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

- పిల్లలు శారీరకంగా తక్కువగా చురుకుగా ఉంటే, ఈ పరిస్థితిలో కూడా డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. తక్కువ శారీరక శ్రమ మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

- కుటుంబంలో తల్లిదండ్రులు, తాతామామలు లేదా తోబుట్టువులకు డయాబెటిస్ ఉంటే, పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


‘ఆర్జిత’ పెంపు ఆగింది!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్