కార్చిచ్చు తెచ్చిన నష్టం దాదాపు రూ.5 లక్షల కోట్లు అని నిపుణులు అంచనా వేశారు. ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలిబూడిదవుతున్న లాస్ ఏంజెలిస్
న్యూయార్క్, జనవరి 9: అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్‌ఫైర్ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజెల్స్ కాలి బూడిదైపోతోంది. ఈ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్‌తోపాటు బిలియనీర్లు నివసిస్తుంటారు. దీంతో మంటల్లో ఖరీదైన ఇళ్లు, కార్లు, ఇతర వస్తువులు మంటల్లో బూడిదవుతున్నాయి. ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా బూడిదైపోయినట్లు తెలిసింది. మాలిబులోని హంటర్ బైడెన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన మాన్షన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంటి ముందు ఉన్న ఖరీదైన కారు సైతం కాలి బూడిదైపోయింది. ఈ మాన్షన్ ఖరీదు 15,800 అమెరికా డాలర్లుగా తెలుస్తోంది. మాన్షన్ మొత్తం కాలి బూడిదైపోయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ కార్చిచ్చు తెచ్చిన నష్టం దాదాపు రూ.5 లక్షల కోట్లు అని నిపుణులు అంచనా వేశారు. ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
30,000 మంది తరలింపు
బిలియనీర్లు నివసించే పసిఫిక్ పాలిసేడ్స్‌తో పాటు పలు చోట్ల మంగళ, బుధవారాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చు బారిన పడి ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందగా, చాలామంది గాయపడ్డారు. 3 వేలకు పైగా విస్తీర్ణంలో ఉన్న 10 వేలకు పైగా ఇండ్లు మంటల్లో చిక్కుకోగా అందులో వెయ్యికి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు లాస్ ఏంజెల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంటోని మార్రోన్ తెలిపారు. ఈ ప్రమాదంలో శాంటామోనికా ప్రాంతంలో ఖరీదైన ఇళ్లు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదయ్యాయి. చాలా మంది తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోయిన వారిలో పలువురు బిలియనీర్లతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీ జేమ్స్ ఉడ్స్, స్టీవ్ గుటెన్‌బర్గ్ తదితరులు ఉన్నారు. ఈ కార్చిచ్చు కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు మీడియా పేర్కొంది.