విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. ముఖ్యంగా నగరంలోని అధ్వాన్నమైన రహదారులు, నిత్యం వేధించే ట్రాఫిక్ సమస్యలపై ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. ముఖ్యంగా నగరంలోని అధ్వాన్నమైన రహదారులు, నిత్యం వేధించే ట్రాఫిక్ సమస్యలపై ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో మగ్గిపోతూ, గుంతల రోడ్లపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. నగరవాసులు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు పాలకులు, ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా మారాయి. నాసిరకం పనులు, సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రధాన రహదారుల నుంచి కాలనీ రోడ్ల వరకు అంతా ఛిద్రమైపోయింది. కొన్నిచోట్ల ఈ గుంతలు ప్రాణాలు తీస్తున్నాయి. బంజారాహిల్స్ వంటి రిచ్ ఏరియాల్లోనూ రోడ్లు కూలి, వాహనాలు ఇరుక్కుపోయిన ఘటనలు ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఐటీ కారిడార్ ప్రాంతాలైన నార్సింగి, నానక్‌రామ్‌గూడ వంటివి ఇప్పుడు ట్రాఫిక్ పద్మవ్యూహాలుగా మారాయి. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో, ప్రజల జీవితంలో మూడు నుంచి నాలుగు గంటల సమయం ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. ఐటీ ఉద్యోగులు సైతం ప్రతిరోజూ ఇదే నరకాన్ని అనుభవిస్తున్నారు. కేవలం 9 శాతం రోడ్డు విస్తీర్ణం, 60 లక్షల వాహనాలు, అరకొర ఫ్లైఓవర్లు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ఈ తీవ్ర సమస్యలపై ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు, అక్కడక్కడా ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రతిపాదనలతో సరిపెడుతోంది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించకుండా, ట్రాఫిక్ పోలీసులు కేవలం చలానాలపై దృష్టి పెడుతున్నారు. తక్షణమే రోడ్ల గుంతలను పూడ్చి, శాస్త్రీయమైన ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను అమలు చేయకుంటే, విశ్వనగరం హోదా కాగితాలకే పరిమితమవుతుంది.
- మహ్మద్ గుల్జార్, హైదరాబాదీ