‘ఆర్జిత’ పెంపు ఆగింది!
ప్రతీకాత్మక చిత్రం
కొండగట్టులో పూజల రుసుం పెంపు వాయిదా
నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నాం: ఆలయ ఈవో
మల్యాల, నవంబర్ 13 (ఈవార్తలు): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఆర్జిత సేవల రుసుం పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. ఆర్జిత సేవల టికెట్ ధర పెంచడంతో సాధారణ భక్తులపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఆలయంలో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నా సేవా రుసుం పెంచడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవల రుసుం పెంపు నిర్ణయాన్ని అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి అంజన్న దర్శనానికి నిత్యం 20 వేల మంది భక్తులు వస్తుంటారు. మంగళ, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంటుంది. ‘ఆలయ ప్రాంగణంలో వసతులు అరకొరగానే ఉంటాయి. కోనేరు పరిశుభ్రంగా ఉండే సందర్భాలు చాలా తక్కువ. ఆలయ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండవు. వాటర్ ట్యాంక్ పరిసరాల్లో చెత్తాచెదారం నిండి ఉంటుంది. అయినా భక్తులను దోపిడీ చేసేందుకే నిర్వాహకులు ఆర్జిత సేవల రుసుం పెంచాలని నిర్ణయించారు. ఒత్తిడితో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు’ అని భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ
అంజన్న ఆలయంలో ఆర్జిత సేవల రుసుం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. ఆ నిర్ణయంపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆర్జిత సేవల రుసుం పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘దేవాలయాల్లో దర్శనం నుండి దేవుడి సేవ వరకు, దేవాలయ ప్రాంగణంలో పార్కింగ్ దగ్గరి నుండి ప్రసాదం వరకు అన్నింటినీ దేవాదాయ శాఖ ఆదాయ మార్గాలుగా మార్చేసింది. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం మీద స్పృహ ఉండదు కానీ భక్తుల మీద భారం మోపి, డబ్బులు దండుకోవడానికి మాత్రం రకరకాల మార్గాలను అన్వేషిస్తుంది. తాజాగా కొండగట్టు అంజన్న దేవాలయంలో ఆర్జిత సేవల రుసుములను దాదాపు రెట్టింపు చేస్తూ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇదే అంశంపై దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్ మాట్లాడాను. కొండగట్టులో సౌకర్యాల లేమి, భక్తులకు కలుగుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టకుండా, రుసుములు పెంచడం ఏంటని ప్రశ్నించా. కొండగట్టు క్షేత్రానికి వచ్చే భక్తుల నుంచి అడ్డగోలుగా రుసుములను పెంచడం కాదు. అంజన్న దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించా’ అని పేర్కొన్నారు.