రాముడు ఎలా గెలిచాడు?

రామాయణం ప్రధాన లక్ష్యం రావణ వధ.. ఇది ఎలా జరిగింది? పురాణాల కథనాల ప్రకారం విష్ణుమూర్తి అప్పటికే ఆరు అవతారాలు ధరించాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరుశురామ అవతారాలన్నీ క్షణాల్లో ముగిసిపోయినా.. శత్రువును నిర్నిరోధంగా హతమార్చినవే ఈ అవతారాలన్నీ.

Rama vs Ravana

ప్రతీకాత్మక చిత్రం

రామాయణం ప్రధాన లక్ష్యం రావణ వధ.. ఇది ఎలా జరిగింది? పురాణాల కథనాల ప్రకారం విష్ణుమూర్తి అప్పటికే ఆరు అవతారాలు ధరించాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరుశురామ అవతారాలన్నీ క్షణాల్లో ముగిసిపోయినా.. శత్రువును నిర్నిరోధంగా హతమార్చినవే ఈ అవతారాలన్నీ. ఒక్క పరుశు రాముడి అవతారం ముగించటానికి కొంత టైం పట్టిందేమో కానీ, ఏ అసురుడిని శిక్షించటానికైతే అవతారాన్ని ధరించాడో.. వచ్చిన పనిని సెకన్ల వ్యవధిలో కానిచ్చేసుకుని చక్కా వైకుంఠానికి వెళ్లిపోయాడు. తనను ఎదిరించే కనీస గడువు కూడా శత్రువుకు ఇవ్వకుండా అంతం చేసిన అవతారమూర్తి, రాముడుగా ఆవిర్భవించిన తరువాత ఆ నారాయణుడు దైవత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు? రావణుణ్ణి తన దివ్యశక్తితో ఎందుకు సంహరించలేదు? దైవశక్తుల్ని ప్రయోగించనప్పుడు.. రావణుణ్ణి ఎలా చంపగలిగాడు?

లంక ఓ మహా సామ్రాజ్యం.. బలవంతుడైన రాజు.. అత్యాధునిక ఆయుధ సంపత్తి.. సూపర్ సోనిక్ వెపన్స్.. సుశిక్షితమైన సేనావాహిని, చతురంగబలాలు.. ఒక్కొక్కరు వంద మందినైనా చంపగల యోధులు ఉన్న రావణుడు ఎదురులేని వాడు.. ముల్లోకాలను జయించిన వాడు.. నేలపై ఉండి యుద్ధం చేయగలడు.. ఏరియల్ అటాక్స్ చేయగలడు.. మిస్సైల్ టెక్నాలజీ తెలిసిన వాడు.. అలాంటి యోధుణ్ణి జయించటం ఎవరికైనా ఎలా సాధ్యం? ఈయనేమో పధ్నాలుగేళ్లు అడవుల్లో గడిపి వచ్చాడు. నారచీరలు.. కందమూలాల ఆహారం.. చేతిలో కోదండం.. అమ్ములపొదిలో బాణాలు.. వెన్నంటి ఉన్న అడవిలో తిరిగే వానరాలు.. రాళ్లూ రప్పలు విసరడం తప్ప కోతులకు యుద్ధ నైపుణ్యం ఎక్కడిది.. ఇద్దరు అన్నదమ్ముల దగ్గర ధనుర్బాణాలు తప్ప మరేవీ లేవాయె.. కనీసం రథం కూడా లేదు.. వెంట ఉన్న సైన్యమేమో.. అడవుల్లో తిరిగే కోతులు.. ఎలుగుబంట్ల జాతుల వారు.. వీరితో పాటు ఉత్తర భారతం నుంచి దక్షిణాపథం వరకూ వెంట వచ్చిన జనసమూహం ఉంది. సంఖ్య ఎక్కువే అయినా.. రావణుడి రణనీతి ముందు వీరంతా బలాదూరే. కోతి బుద్ధులు కోటి.. ఇలాంటి వాళ్లను వెంటేసుకొని వెళ్లిన రాముడు రావణాసురుని గెలవటం ఎలా సాధ్యమైంది? కేవలం దేవుడు కాబట్టే అలా జరిగిందా? కేవలం రాముడి దగ్గరే అంతులేని శక్తి ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? రామావతారంలో ఎక్కడా దైవశక్తి ప్రదర్శన కొంచెం కూడా కనిపించదు. అలాంటప్పు డు రాముడి శక్తిసామర్ధ్యాలు ఏపాటివి? ఆయన బలాబలాలు.. యుద్ధ వ్యూహాలు ఏమిటి? పోనీ అయోధ్యలో ఉన్నాడంటే.. అక్కడి సైన్యం తోడైనా ఉండేది.. కానీ, రాముడికి ఉన్న యుద్ధనీతి ఏమిటి?

రావణుడి కడుపులో అమృతం ఉందని విభీషణుడు చెప్పటం.. లేదు లేదు.. ధర్మానికి విరుద్ధంగా.. నేను కడుపుపై బాణం వేయనని రాముడు అనటం.. హనుమంతుడు గాలిని పార్థించటం.. బాణం కాస్తా దారి మళ్లి కడుపులో గుచ్చుకోవటం ఇదంతా రామాయణ యుద్ధంలో వాస్తవంగా జరిగిందా? అసలు ఓ వ్యక్తి కడుపులో అమృతం ఉన్న కుండను దాచుకోవటం సాధ్యమయ్యేపనేనా? ఒకవేళ రావణుడి కడుపులో అమృతభాండం ఉందని కాసేపు అనుకుందాం. దేవతలకు అమృతం దొరికిన తరువాత వాళ్లు దాన్ని తాగి.. తమ రక్తంలో కలిపేసుకుని చిరంజీవు లయ్యారు. అంతే కానీ, గిన్నెల్లోనో.. కుండల్లోనో నింపుకుని కడుపుల్లో దాచుకోలేదు. అమృతం తాగితే చిరంజీవులు అవుతారు కానీ, సీల్ చేసి కడుపులో పెట్టుకుంటే ఎలా చిరంజీవి అవుతారు? అలాంటప్పుడు రాముడు కడుపులోకి బాణం కొట్టి అమృతభాండాన్ని బద్దలు చేయటం ఏమిటి? దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? రామాయణంలో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఆయన విష్ణువుగా.. అవతార పురుషుడిగా మనకు కనిపించడు. ఒక మనిషి తానుగా ఎలా ఎదగాలి.. శక్తి సామర్థ్యాలు ఎలా సంపాదించుకోవాలి? విజేతగా ఎలా నిలవాలి? అన్నవాటిని అక్షరాలా తాను చేసి చూపించినవాడు శ్రీరామచంద్రుడు. నేను మనిషిని.. మనిషి ధర్మమే నాది.. ఈ భూమ్మీద ఎలాంటి అధర్మపు నీడను కూడా నేను సహించను అని అరణ్యకాండలో రాముడు విస్పష్టంగా చెప్పాడు. కాబట్టి శ్రీరామ చంద్రుడు అవతారపురుషుడే అయినా ఖచ్చితంగా సాధారణ మనిషి లాగానే తానూ ప్రవర్తించాడు. ఆయన ఒక రాజుగా తాను చేయవలసిందంతా చేశాడు. ధర్మాన్ని అతిక్రమించిన వాళ్లు ఎంతటి వారైనా శిక్షించాడు. యుద్ధ రంగంలో అలా వెళ్లి ఏవో దివ్యశక్తులతో రావణుణ్ణి దండించలేదు. చిన్నప్పటి నుంచీ రాముడు ఒక లక్ష్యంతో పెరిగాడు. అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. ఏ ఆయుధాన్ని, ఏ అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో పూర్తి నైపుణ్యంతో నేర్చుకున్నాడు. చిన్నతనంలో గురువు దగ్గర విద్యాభ్యాసానికి వెళ్లటానికి ముందే ధనుర్విద్య ప్రారంభించాడు. భారత కాలం నాటికి చాలా ఆయుధాలు రంగంలోకి వచ్చాయి కానీ, త్రేతాయుగంలో మాత్రం విల్లే ప్రధాన ఆయుధం.. ఇందజిత్తు, రావణుడు, రాముడు, లక్ష్మణుడు అంతా విల్లుతో యుద్ధం చేసిన వాళ్లే.

రాముడికి ధనుర్విద్యలో ఓనమాలు నేర్పింది ఎవరో తెలుసా? ఎవరైతే ఆయన్ను అడవులకు పంపాలని భర్తను డిమాండ్ చేసిందో ఆమే.. కైకేయి. మొదట్నుంచీ ఆమె టార్గెట్ రాముణ్ణి రావణాంతకుడిగా తయారుచేసి పంపిచాలన్నదే.. అందుకోసమే మొదట్నుంచీ రాముణ్ణి పెంచి పెద్ద చేసింది కైకేయే. ధనుర్విద్యను రాముడు మొదట ఆమె దగ్గరే నేర్చుకున్నాడు. ఆ తరువాత విశ్వామిత్రుడితో యాగరక్షణ పేరుతో అడవికి వెళ్లి ఆయన దగ్గర అనేక అస్త్రాలను ప్రయోగించటం, ఉపసంహరించటం నేర్చుకున్నాడు. ఆనాటి కాలంలో అతి ముఖ్యమైన బల అతిబల విద్యలను కూడ విశ్వామిత్రుడి దగ్గరే రాముడు నేర్చుకున్నాడు. రాముడు అడవికి వెళ్లే నాటికే పూర్తిస్థాయిలో యుద్ధవిద్యల్లో ఆరితేరినవాడు. అడవుల్లో పధ్నాలుగేళ్లు వనవాస జీవితం గడిపినా.. సాధువులా ఉండలేదు. దండకారణ్యానికి రావణుడి ప్రతినిధిగా, మన పరిభాషలో గవర్నర్లుగా వ్యవహరిస్తున్న ఖరదూషణులను.. వారి దగ్గరున్న 14వేల మంది సైన్యాన్ని అంతం చేశాడు. శూర్ఫణకను ఆయన తమ్ముడు పరాభవించి పంపాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మొదట్నుంచీ మనం ఏ విద్యనైనా ఎలా నేర్చుకుంటామో.. రాముడూ అలాగే నేర్చుకున్నాడు. మహారాక్షస సంహారానికి వ్యూహాత్మకమైన రణతంత్ర ప్రయోగాన్ని చేశాడు. తాను అడవికి వెళ్లింది రావణ సంహారానికని రాముడికి స్పష్టంగా తెలుసు.. మొదట మారీచ సుబాహుల ద్వారా తాను వచ్చానన్న సంకేతాన్ని రావణుడికి పంపించాడు. ఆ తరువాత ఖరదూషణులను చంపటంతో అతణ్ణి కవ్వించినట్లయింది. శూర్పణక పరాభవంతో రావణుడు పూర్తిగా రాముడి ఎత్తుగడకు పడిపోయాడు.. పరుగులు పెడుతూ దండకారణ్యానికి వచ్చి చేయరాని తప్పిదాన్ని, సీతాపహరణం రూపంలో చేసేశాడు. రాముడు లంకలో ప్రవేశించటానికి ముందే చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. సీతాదేవిని ఏ వైపు రావణుడు తీసుకెళ్లాడో జటాయువు ముందే చెప్పాడు. అందుకే హనుమంతుడిని అటువైపు పంపించాడు. అతను లంకకు వెళ్లి సీతమ్మ జాడను తెలుసుకోవడం కంటే చాలా పెద్దపనే చేశాడు. దీంతో రాముడి గెలుపు చాలా సులువైంది.

ఆంజనేయుణ్ణి లంకకు పంపించటం వెనుక రాముడి రణతంత్రాన్ని రావణుడు ఊహించలేకపోయాడు. హనుమంతుడు.. సీత జాడతో పాటు రావణుడి వ్యూహాత్మక యుద్ధ స్థావరాలను ధ్వంసం చేశాడు. అతడి కుమారుల్లో ఒకడైన అక్షయుణ్ణి హతమార్చాడు. వైమానిక దాడుల కోసం రావణుడు ఉపయోగించే విమానాశ్రయాలను ధ్వంసం చేశాడు. ఆయుధాగారాలను దగ్ధం చేశాడు. వానరులు.. గోలాంగూలాలు.. భల్లూకులు రాముడి సేనావాహినిలో మూడు ప్రధాన విభాగాలుగా ఉన్నాయి. లంకకు చేరుకున్న తరువాత మూడు వైపుల మూడు దళాలను మోహరించాడు. అదే సమయంలో అన్నతో గొడవపడి వచ్చిన విభీషణుణ్ణి తన శిబిరంలోకి చేర్చుకోవటం యుద్ధనీతిలో భాగమే. శత్రువు బలాలు.. బలహీనతల గురించి తెలుసుకుని దానికి తగ్గట్టుగా యుద్ధవ్యూహం పన్నటానికి ఇతను ఆసాంతం రాముడికి ఉపయోగపడ్డాడు. అదే సమయంలో రావణుడు కూడా తన నిఘా వర్గాలను అలర్ట్ చేశాడు. ఇద్దరు సీక్రెట్ ఏజెంట్లు రాముడి వెంట ఉన్న సైన్యం వివరాలను, శక్తి సామర్థ్యాలను రావణుడికి వివరించారు. రావణుడు తన దగ్గరున్న దుర్భిణి(మైక్రోస్కోప్) ద్వారా రాముడి సైన్యాన్ని చూసి ఓ అంచనాకు వచ్చాడు. దాదాపు 18 మంది సేనా నాయకులు రావణుడి సైన్యాన్ని పటిష్ఠంగా నడిపిస్తున్నారు. ప్రహస్తుడు.. ఇంద్రజిత్తు, నికుంభుడు, విరూపాక్షుడు లాంటి వారుండగా.. తానూ, కుంభకర్ణుడూ యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం రానే రాదనుకున్నాడు రావణుడు. విరూపాక్షుణ్ణి నగరం మధ్యలో ఉంచి.. మిగతా వీరులను లంకానగరానికి నాలుగు ద్వారాల దగ్గరా మోహరించాడు. అదే విధంగా రాముడు కూడా తన వీరులను నాలుగువైపులా పంపాడు. ఓ వైపు లంకపై వానరసేన ముప్పేటదాడికి పూనుకుంది. మరోవైపు ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై నాగాస్తాన్ని ప్రయోగించాడు. దాంతో ఇద్దరూ మూర్ఛపోయారు. గరుత్మంతుడు వచ్చి వాళ్లను విడిపించాల్సి వచ్చింది. ప్రహస్తుని నీలుడు హతమార్చాడు. ఇంద్రజిత్తును హతమార్చటానికి లక్ష్మణుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు ఒకరాత్రి మూర్ఛపోయిన లక్ష్మణుణ్ణి అంజనేయుడు తెచ్చిన సంజీవనీ మూలికలతో సుశేనుడు బతికించాడు. చివరకు రావణుడు రంగంలోకి ప్రవేశించక తప్పలేదు. రావణుడి భీకర యుద్దానికి సుగ్రీవుడు మూర్చపోయాడు. అతని పిడికిలి దెబ్బకు హనుమంతుడు కంపించిపోయాడు. రావణుడు విసిరిన శక్తికి లక్ష్మణుడు సొమ్మసిల్లి పడిపోయాడు.. ఆ తరువాత హనుమంతుడు రాముడిని తన భుజాలపై ఎక్కించుకుని అసురుడిపైకి ఉరుకురికి వెళ్లాడు. రాముడి బాణాలకు రావణుడి రథం, గుర్రాలు.. ధ్వంసం అయ్యాయి. మర్నాడు కుంభకర్ణుడు సీన్లోకి వచ్చాడు. ఇతని దెబ్బకు హనుమంతుడు రక్తం కక్కుకున్నాడు. మిగతా వానరవీరులు వాడి విదిలింపులకే మూర్చపోయారు. ఆ తరువాత రాముడు రెండు గొప్ప అస్త్రాలను ప్రయోగించి అతణ్ణి హతమార్చాడు.

మూడో రోజున తిరిగి రావణుడితో భీకరమైన యుద్ధం జరిగింది. రామరావణుల శరీరాలు రక్తసిక్తమయ్యాయి. రావణుడితో సమానంగా పోరాడటం కోసం ఇంద్రుడు తన రథాన్ని పంపించాడు. రావణుడి తలల్ని నూటొక్క సార్లు తెగనరికినా అవి తిరిగి మొలుస్తూనే ఉన్నాయి. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం రావణుడి గుండెను చీల్చేసింది. అలా రాముడు రావణుణ్ణి హతమార్చాడు. రావణ వధ అంతా చెప్పుకుం టున్నట్టు విజయదశమి నాడు జరగలేదు. యుద్ధకాండ (92/64)లో చెప్పినట్టు అమావాస్య రోజున చోటు చేసుకుంది. రావణుడిని వధించిన సమయంలో రాముడు జయ నినాదం చేశాడు. ఓ చేత్తో ధనస్సును.. మరో చేత్తో బాణాణ్ణి పట్టి తిప్పుతూ రక్తంతో ఎరుపెక్కిన శరీరంలో నిలుచున్నాడు. రాముడు దేవుడిలా కంటే మామూలు మనిషిలాగానే వీరోచితంగా పోరాడాడు.. యుద్ధంలో ఆయన శరీరం కూడా గాయపడింది.. నువ్వానేనా అన్న స్థాయిలో యుద్ధం చేశాకే రాముడు గెలిచాడు. అంతే కానీ.. ఏదో దివ్యశక్తులతో ఓ సుదర్శన చక్రాన్ని సింపుల్గా ప్రయోగించి రావణుణ్ణి చంపలేదు. తాను ఒక మనిషిగా.. మనిషి జీవితంలో విశ్వవిజేతగా నిలవాలంటే ఏ విధంగా ఉండాలో.. ఏం చేయాలో రాముడు అది చేసి చూపించాడు. మనిషిలో ఉండాల్సిన అన్ని కోణాలను రాముడు చూపించగలిగాడు. కాబట్టే ఆయన లోకనాయకుడయ్యాడు.

- కోవెల సంతోష్ కుమార్, రచయిత

ఫోన్ నం: 9052116463


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్