ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి రక్తపు సింధూరాన్ని పూసుకున్నాయి. బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు.
ప్రతీకాత్మక చిత్రం
ముగ్గురు జవాన్లు మృతి
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి రక్తపు సింధూరాన్ని పూసుకున్నాయి. బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. దంతెవాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రాకు చెందిన సిబ్బంది బుధవారం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 12 మంది నక్సల్స్ చనిపోయారు. ముగ్గురు డీఆర్జీ సిబ్బంది సైతం మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అడవిలో కాల్పులు జరిగాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పట్టిలింగం తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సింగిల్ లోడింగ్ రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పశ్చిమ బస్తర్ డివిజన్‌లోని ఎన్‌కౌంటర్ ప్రదేశానికి బలగాలను పంపామని, ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.