అంబర్‌పేట, నవంబర్ 26 (ఈవార్తలు): బెట్టింగ్ కోసం సర్వీస్ రివాల్వర్‌నే అమ్మేశాడో ఎస్సై. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్లో క్రైం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాశ్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.
ప్రతీకాత్మక చిత్రం
అంబర్‌పేట, నవంబర్ 26 (ఈవార్తలు): బెట్టింగ్ కోసం సర్వీస్ రివాల్వర్‌నే అమ్మేశాడో ఎస్సై. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్లో క్రైం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాశ్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. 2020 బ్యాచ్‌కు చెందిన భానుప్రకాశ్ ఇటీవల 4 తులాల బంగారం చోరీ కేసును విచారించాడు. రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా త్వరలో ఇస్తానని నమ్మించి, లోక్ అదాలత్‌లో ఇరు వర్గాలతో మాట్లాడి కేసును క్లోజ్ చేయించాడు. కానీ కేసు మూసేసిన తర్వాత కూడా బాధితులకు బంగారం ఇవ్వకుండా, తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఇటీవల తనకు కేటాయించిన 9 ఎంఎం సర్వీస్ పిస్టల్ కనిపించడం లేదని స్టేషన్‌కు వచ్చి గోల చేశాడు. అతని డ్రా చెక్ చేయగా బుల్లెట్లు మాత్రమే కనిపించాయి. గన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సీసీ కెమెరా ఫుటేజీని చెక్ చేస్తే.. రికవరీ చేసిన బంగారాన్ని డ్రాలో పెట్టి తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా లభించాయి. అయితే గన్ సంగతి అడిగితే.. డ్రాలోనే పెట్టా, ఏమైందో తెలియడం లేదని అని భాను ప్రకాశ్ చెప్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడ్డ భాను ప్రకాశ్.. దాదాపు రూ.70–80 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతోనే ఈ అక్రమాలకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. విషయం పైస్థాయికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.