ముంబై’ చేరిన శార్దూల్
శార్దుల్ ఠాకూర్
ఐపీఎల్ 19వ సీజన్ వేలానికి ముందే స్టార్ ఆల్‌రౌండర్‌ను ముంబై ఇండియన్స్ కొనేసింది. రీటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ బిగ్ ప్లేయర్ అయిన శార్దూల్ ఠాకూర్‌ను చేజిక్కించుకుంది. పరస్పర బదలాయింపు విధానంలో లేదా ట్రేడ్ డీల్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి శార్దూల్‌ను తీసుకునేందుకు ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు జరిగాయి. చివరకు రూ.2 కోట్లకు తమ గూటికి చేర్చుకుంది. దాంతో.. ట్రేడ్ పద్దతిన పేస్ అల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను ముంబై వదులుకోనుందనే వార్తలకు చెక్ పడింది. శార్దూల్‌ను కొన్న విషయాన్ని ముంబై ఎక్స్ వేదికగా వెల్లడించింది. కలల సిటీ అయిన ముంబై, మా ఇల్లుకు స్వాగతం అని పోస్ట్ పెట్టింది ముంబై. ఐపీఎల్‌లో మరో ప్లేయర్‌కులేని రికార్డు శార్ధూల్ ఠాకూర్‌కు ఉంది. ఈ పేస్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకూ మూడు సార్లు వేలానికి వెళ్లకుండానే అమ్ముడయ్యాడు. 2017లో కింగ్స్ లెవన్ పంజాబ్ నుంచి అతడిని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తీసుకుంది. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ వద్దనుకోవడంతో శార్దూల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు లక్నో నుంచి రూ.2 కోట్లకు ముంబై అతడిని కొనుగోలు చేసింది. ముంబై ప్రధాన పేసర్ దీపక్ చాహర్ గాయపడిన విషయం తెలిసిందే. అతడి స్థానాన్ని శార్దూల్ భర్తీ చేయనున్నాడు.
రూథర్‌ఫోర్డ్ కూడా..
శార్దూల్ ఠాకూర్ ట్రేడింగ్‌ను ధ్రువీకరించిన కొద్ది నిమిషాలకే ముంబై ఇండియన్స్ తమ రెండో డీల్‌ను ప్రకటించింది. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ షెర్పేన్ రూథర్‌ఫోర్డ్‌ను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. రూథర్‌ఫోర్డ్ గుజరాత్ టైటాన్స్‌కు రూ.2.6 కోట్లకు అమ్ముడయ్యాడు. అదే ధరతో ముంబై ఇండియన్స్‌కు మారనున్నాడు. 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున 13 మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు.